Okra : బెండకాయలు అంటే చాలా మందికి ఇష్టమే. చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా వేపుడు చేసుకుని తింటే బెండకాయలు భలే రుచిగా ఉంటాయి. అయితే బెండకాయలను ఎలా వండినా అవి జిడ్డుగా ఉంటాయి. కనుక కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని జిడ్డు లేకుండానే వండుకోవచ్చు. దీంతో రుచి కూడా మరింత పెరుగుతుంది. ఈ క్రమంలోనే జిడ్డు లేని బెండకాయ కూరలను ఇంకా ఎక్కువ ఇష్టంతో తినవచ్చు. అయితే వండిన తరువాత బెండకాయల్లో జిడ్డు లేకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయలు జిడ్డు లేకుండా పొడిగా ఉండాలంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో నానబెట్టాలి. ఒక లీటర్ నీటిలో ఒక కప్పు వెనిగర్ కలిపి అందులో బెండకాయలను వేసి సుమారుగా ఒక గంట పాటు ఉంచాలి. దీంతో బెండకాయల్లో ఉండే జిడ్డుపోతుంది. తీగలుగా సాగవు. అయితే ఇది కాస్త టైమ్ పడుతుంది. కనుక అంత టైమ్ లేని వారు కింద తెలిపిన స్టెప్‌ను ఫాలో కావచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..
బెండకాయలను వేపుడు చేసినా.. పులుసు లేదా కూరగా చేసినా.. తీగలుగా సాగకూడదు.. అనుకుంటే వాటిని కోసేటప్పుడే తేమ లేకుండా చూసుకోవాలి. ముందుగా వాటిని బాగా కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. అవి పొడిగా అయ్యేవరకు.. తడి మొత్తం పోయే వరకు వాటిని వస్త్రంతో తుడవాలి. ఆ తరువాత కత్తి, చేతులకు తడి లేకుండా చూసుకోవాలి. అనంతరం వాటిని కట్ చేయాలి.
ఇక బెండకాయలను వండే క్రమంలో పాత్రలో నూనె పోసి తరువాత వాటిని వేశాక 5-10 నిమిషాలు వాటిని వేయించి అప్పుడు కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ లేదా ఆమ్‌చూర్ లేదా చింతపండు వేయాలి. దీంతో బెండకాయలు కూర అయ్యాక తీగలుగా సాగకుండా.. జిడ్డు లేకుండా ఉంటాయి. ఇలా బెండకాయలను వండుకుని తినాలి. దీంతో జిడ్డు లేకుండా పొడిగా బెండకాయలను తినవచ్చు. ఇవి చాలా రుచికరంగా కూడా ఉంటాయి.
ఇక బెండకాయలతో ఏ కూర చేసినా సరే పాత్ర మీద మూత పెట్టరాదు. పెడితే పాత్రలో తేమ ఊరుతుంది. దీంతో బెండకాయలు మళ్లీ జిడ్డుగా మారుతాయి. అలాగే ఉప్పును ముందుగా వేసినా తేమ వచ్చి బెండకాయలు మళ్లీ జిడ్డుగా, సాగుతూ మారిపోతాయి. కనుక ఉప్పును చివర్లో వేయాలి. ఈ విధమైన సూచనలు పాటించడం వల్ల బెండకాయలను జిడ్డు లేకుండా.. తీగలుగా సాగకుండా.. వండుకుని తినవచ్చు.