Corn Dosa : మొక్కజొన్నలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక మొక్కజొన్నలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటితో దోశలను కూడా వేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉండడమే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇక మొక్కజొన్న దోశ (కార్న్ దోశ)ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్క జొన్నలు – మూడు కప్పులు, ఎండు మిర్చి – రెండు, పచ్చి మిర్చి – రెండు, మినప పప్పు – పావు కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్, కరివేపాకు – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత, నూనె – సరిపడా.
కార్న్ దోశ తయారు చేసే విధానం..
మొక్క జొన్నలు, మినప పప్పును అరగంట పాటు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత అందులో ఎండు మిర్చి, పచ్చి మిర్చి, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక దోశలు వేసి కాల్చాలి. దోశపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చాలి. తరువాత చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన దోశలను తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. ఈ దోశలను టమాటా లేదా కొబ్బరి చట్నీతో తింటే బాగుంటాయి.