Crispy Aloo Fry : దుంప జాతికి చెందని కూరగాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిలో బంగాళాదుంపలు కూడా ఒకటి. బంగాళాదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో మనం సులభంగా చేసుకోదగిన వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. బంగాళాదుంప ఫ్రైను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్.
క్రిస్పీ ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను నీటిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టుకుని నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి వేయించాలి. వీటిని కలుపుతూ ఎర్రగా కరకకరలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, రసం, సాంబార్ తో వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.