Crispy Onion Rings : మనం ఉల్లిపాయలతో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. ఉల్లిపాయలతో చేసే చిరుతిళ్లల్లో ఆనియన్ రింగ్స్ కూడా ఒకటి. ఈ రింగ్స్ చాలా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని చిటికెలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఆనియన్ రింగ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ ఆనియన్ రింగ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ఉల్లిపాయలు – 2, మైదాపిండి – అర కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, కారం – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్రిస్పీ ఆనియన్ రింగ్స్ తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను గుండ్రంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా వెడల్పుగా ఉండేలా కట్ చేసుకుని విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో మైదాపిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, వంటసోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత చల్లటి నీటిని పోసి పిండిని గంటె జారుడుగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బ్రెడ్ క్రంబ్స్ ను తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ రింగ్ ను పిండిలో ముంచాలి. తరువాత దీనిని బ్రెండ్ క్రంబ్స్ తో బాగా కోటింగ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత ఆనియన్ రింగ్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ రింగ్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగాఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.