Dahi Bhalla : దహీ బల్లా.. దీనినే పెరుగు వడ, దహీ వడ అని కూడా అంటారు. ఇవి మనకు చాట్ బండార్ లలో, హోటల్స్ లో లభిస్తూ ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. చాలా మంది వీటిని రుచి చూసేఉంటారు. అందరూ ఎంతో ఇష్టంగా వీటిని తింటూ ఉంటారు. బయట ఎక్కువగా లభించే ఈ దహీ బల్లాను అచ్చం అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా చాలాసులభంగా తయారు చేసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ దహీ బల్లాను స్ట్రీట్ స్లైల్ లో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ బల్లా తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన మినపప్పు – ఒక కప్పు, పెరుగు -300 గ్రా., పచ్చిమిర్చి – 3, అల్లం – ఒక ఇంచు ముక్క, కారం – ఒక టీ స్పూన్, జీలకర్ర – 2 టీ స్పూన్స్, మిరియాలు – 12, ఉప్పు – తగినంత, బేకింగ్ సోడా – చిటికెడు, తరిగిన జీడిపప్పు – కొద్దిగా, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, పుదీనా కొత్తిమీరచాట్ చట్నీ – కొద్దిగా, చింతపండు చాట్ చట్నీ – కొద్దిగా.
దహీ బల్లా తయారీ విధానం..
ముందుగా జార్ లో మినపప్పును, పచ్చిమిర్చిని, అల్లాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే 2 టీ స్పూన్ల నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తరిగిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉప్పు, వంటసోడా, అర టీ స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో లీటర్ నీటిని తీసుకోవాలి. తరువాత వీటిని వేయించిన పునుగులను వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత ఈ పునుగులను రెండు చేతులతో వత్తుతూ ఎక్కువగా ఉండే నీటిని తీసివేయాలి. ఇలా నీటిని పిండేసిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి.
ఇప్పుడు కళాయిలో జీలకర్ర, మిరియాలు వేసి వేయించి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పెరుగును తీసుకునిఇందులో పంచదార, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పునుగులను తీసుకుని వాటిపై పెరుగును వేసుకోవాలి. తరువాత ఈ పునుగులపై కొద్దిగా పుదీనా చాట్ చట్నీని వేసుకోవాలి. తరువాత చింతపండు చాట్ చట్నీని వేసుకోవాలి. తరువాత జీలకర్ర, మిరియాల పొడి చల్లుకోవాలి. తరువాత కారం, చాట్ మసాలా కూడా చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ బల్లా తయారవుతుంది. దీనిని స్నాక్స్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. పుదీనా చాట్ చట్నీ, చింతపండు చాట్ చట్నీ లేకుండా కూడా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇంట్లోనే రుచిగా దహీ బల్లాను తయారు చేసుకుని తినవచ్చు.