Dahi Puri : మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన పానీపూరీ బండ్ల మీద, అలాగే చాట్ బండార్ లలో లభించే చిరుతిళ్లల్లో దహీ పూరీ కూడా ఒకటి. దహీ పూరీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు మనలో చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ దహీ పూరీని ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలూ కాదని భావిస్తూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల స్ట్రీట్ స్టైల్ దహీ పూరీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ దహీ పూరీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దహీ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పానీపూరీ చిప్స్ – తగినన్ని, తరిగిన ఉల్లిపాయ – 1, సేవ్ – కొద్దిగా, చాట్ మసాలా – కొద్దిగా.
గ్రీన్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొత్తిమీర – అర కప్పు, పుదీనా – పావు కప్పు, పచ్చిమిర్చి – 1, అల్లం – ఒక ఇంచు ముక్క, పెరుగు – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, ఉప్పు – తగినంత, పంచదార – ర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్.
స్వీట్ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – అర కప్పు, వేడి నీళ్లు – పావులీటర్, బెల్లం తురుము – 100 గ్రా., ఉప్పు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్.
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, కారం – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
పెరుగు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, పంచదార – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్.
దహీ పూరీ తయారీ విధానం..
ముందుగా గ్రీన్ చట్నీకోసం జార్ లో చట్నీకి కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత స్వీట్ చట్నీకోసం చింతపండు నుండి చిక్కటి గుజ్జును తీసుకుని కళాయిలో వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి.తరువాత బెల్లం వేసి బెల్లం కరిగే వరకు ఉడికించాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కర్రీకోసం గిన్నెలో బంగాళాదుంపలను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి అంతాకలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత పెరుగు కోసం ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి.
ఇప్పుడు పూరీ చిప్స్ ను వేయించి వాటికి రంధ్రాలు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పూరీలలో బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత ఇందులో గ్రీన్ చట్నీని, స్వీట్ చట్నీని వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను స్టప్ చేసుకోవాలి. తరువాత వీటిపై పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకున్న తరువాత వీటిపై ఉప్పు, కారాన్ని, చాట్ మసాలాను చల్లుకోవాలి. తరువాత వీటిపై సేవ్ ను చల్లుకుని వాటిపై మరికొద్దిగా పెరుగును వేసుకోవాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దహీ పూరీ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే శుభ్రమైన వాతవరణంలో దహీ పూరీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.