Dal In Dhaba Style : బయట మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు సహజంగానే రహదారి పక్కన ఉండే హోటల్స్ లేదా ధాబాల్లో తింటుంటాం. హోటల్స్‌లో అందించే ఫుడ్స్ సహజమే అయినా ధాబాల్లో అందించే ఫుడ్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ధాబాలలో వండే వంటలు ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉంటాయి. ఇవి ఎక్కువగా చపాతీ లేదా రోటీలతో రుచిగా ఉంటాయి. ఇక ధాబాలలో మనకు ఎక్కువగా లభించే వంటల్లో పప్పు కూడా ఒకటి. ధాబాలలో దీన్ని దాల్ పేరిట వడ్డిస్తారు. ఇది అనేక రకాల రుచులను కలిగి ఉంటుంది. అయితే కాస్త శ్రమిస్తే చాలు, ధాబా స్టైల్ రుచి వచ్చేలా మనం దాల్‌ను ఇంట్లోనే ఎంతో చక్కగా తయారు చేయవచ్చు. ఇక దీన్ని ఎలా చేయాలో, ఇందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్‌లో దాల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, శనగపప్పు – అర కప్పు, నీళ్లు – 3 కప్పులు, పసుపు – 1 టీస్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – చిన్న ముక్క, నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, ఉల్లిపాయ – 1, టమాటాలు – 2, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్, కారం – 1 టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, ఆమ్ చూర్ పొడి – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండు మిర్చి – 2.
ధాబా స్టైల్‌లో దాల్‌ను తయారు చేసే విధానం..
రెండు పప్పుల్ని కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తీసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయాలి. అన్నీ వేగాక తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలిపి పప్పు ఉడుకుతున్నప్పుడు దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు, చపాతీల్లోకి కూడా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.