Dam Ka Murgh : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో ధమ్ కా ముర్గ్ కూడా ఒకటి. నిజాం కాలం నాటి వంటకమైన ఈ ధమ్ కా ముర్గ్ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ ను పూర్తిగా ధమ్ ఉడికించి చేసే ఈ కర్రీని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. జ్యూసీగా, ఎంతో కమ్మగా ఉండే ఈ చికెన్ కర్రీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వివిధ రకాల రుచులను ట్రై చేయాలనుకునే వారు ఈ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయాల్సిందే. హైదరాబాద్ స్పెషల్ ధమ్ కా ముర్గ్ ను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ధమ్ కా ముర్గ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, యాలకులు – 4, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, సాజీరా – ఒక టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, నీళ్లు – 50 ఎమ్ ఎల్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 15, చిరోంజి పప్పు – ఒక టేబుల్ స్పూన్, సార పప్పు – 2 టీస్పూన్, బాదంపప్పు – 25, పచ్చిమిర్చి – 2.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం – ఒకనిమ్మకాయ నుండి తీసినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
ధమ్ కా ముర్గ్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత దీనిని రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో పచ్చిమిర్చి తప్ప మిగిలిన మసాలాకు కావల్సిన పదార్థాలు వేసి బాగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మసాలా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి కలపాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై నూనె వేసి కలపాలి.
ఇప్పుడు కళాయి అంచుల చుట్టూ పిండిని ఉంచి ఆవిరి బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టాలి. ఇప్పుడు ఈ కళాయిని మరలా స్టవ్ మీద ఉంచి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దమ్ కా ముర్గ్ తయారవుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చికెన్ తో ఇలా వెరైటీగా వండుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న చికెన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.