Dhaba Style Egg Kadai Masala : మనకు ధాబాలల్లో లభించే ఎగ్ వెరైటీలల్లో ఎగ్ కడాయి మసాలా కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. జీరా రైస్, రోటీ, నాన్, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. ఈ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో,స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే ఎగ్ కడాయి మసాలాను తయారు చేసి తీసుకోవచ్చు. ధాబా స్టైల్ ఎగ్ కడాయి మసాలాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధాబా స్టైల్ ఎగ్ కడాయి మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నీళ్లు – ఒక కప్పు,పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ ఫ్రై కోసం కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉడికించిన కోడిగుడ్లు – 5.
ధాబా స్టైల్ ఎగ్ కడాయి మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎగ్స్ ని ఫ్రై చేసుకోవడానికి నూనె వేసి వేడి చేయాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కళాయిని పక్కకు ఉంచాలి. తరువాత ఉల్లిపాయలను జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
తరువాత టమాట పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చిల్లీ ప్లేక్స్ వేసి కలపాలి. ఇందులో పావు కప్పు నీళ్లు పోసి మసాలాలు మాడిపోకుండా వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఒక కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి పెరుగు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కసూరిమెంతి వేసి కలపాలి. తరువాత వేయించిన కోడిగుడ్లు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ కడాయి మసాలా తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.