Chethabadi : చేతబడి.. ఈ పదం వింటే చాలు చాలా మంది వెన్నులో వణుకుపుడుతుంది. మరి నిజంగా చేతబడి అనేది ఉందా.. చేతబడి ఎలా చేస్తారు… చేతబడి చేశారో లేదో ఎలా తెలుసుకోవాలి.. వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చేతబడి అనే మాట మనకు గ్రామాల్లో ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి అనారోగ్యం పాలైనా, ఇంట్లో ఒకరితరువాత ఒకరు చనిపోతున్నా, వ్యాపారులకు వరుసగా నష్టాలు వస్తున్నా మా పైన ఎవరో చేతబడి చేశారు అనే భావన వారిలో సహజంగానే కలుగుతుంది. అసలు చేతబడి నిజంగా ఉందా అంటే దానికి రకరకాల సమాధానాలే వస్తాయి. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఓ నిగూఢ శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. దానిని కొందరు దేవుడు అంటే కొందరు దెయ్యం అంటారు.
పాజిటివ్ ఎనర్జీని నెగెటివ్ ఎనర్జీగా మార్చి వేరొకరి మీద ప్రయోగించేదే చేతబడి. ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో వివిధ పేర్లతో చెలామణిలో ఉంది. చేతబడిని రెండు రకాలుగా ప్రయోగిస్తారు. ఒకటి ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, మరొకటి ఇతురులను వశపరుచుకోవడానికి చేస్తుంటారు. దీనినే వశీకరణం అంటారు. గ్రామాల్లో దీన్నే మందు పెట్టడం అని కూడా అంటారు. చేతబడి అనేది ఎవరి మీద పడితే వారి మీద ప్రయోగించడానికి వీలు పడదు. దానికి కొన్ని కఠిన నియమ నింబంధనలు ఉంటాయి. చేతబడి ఎవరి మీదనైతే చేయించాలనుకుంటున్నామో వారు దగ్గర బంధువులో లేదా ప్రాణ స్నేహితులో అయి ఉండాలి. ఇది మొదటి నిబంధన. చేతబడి చేసే వ్యక్తి దాని బారిన పడే వ్యక్తి ఒకే ఊరిలో ఉండాలి. ఇద్దరి మధ్య నదులు, కాలువలు అడ్డంగా ఉండకూడదు. ఇలా ఉంటే ఆ నీటి ప్రవాహానికి ఉన్న శక్తి నెగెటివ్ ఎనర్జీని కట్టడి చేస్తుంది.
అలాగే చేతబడి అనేదానిని చంద్రుడు కనిపించే రోజుల్లో కాకుండా క్షీణిస్తున్న రోజుల్లోనే చేయాలి. చంద్రుడు నుండి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఈ నెగెటివ్ ఎనర్జీ పైన ప్రభావం చూపిస్తుందట. అందుకే క్షుద్ర పూజలు ఎక్కువగా అమావాస్య రోజుల్లో చేస్తుంటారు. అమావాస్యకు ఆదివారం కూడా కలిసొస్తే అది ఇంకా ప్రభావవంతంగా పని చేస్తుందట. ముందుగా చేతబడిని ఏ వ్యక్తి మీదైతే ప్రయోగించాలనుకుంటున్నారో ఆవ్యక్తి యొక్క జుట్టు, వేసుకున్న బట్టలు, అతని కాలు కింద ఉన్న మట్టిని సేకరిస్తారు. ఇలా సేకరించిన మట్టిని బియ్యం పిండిలో కలిపి ఒక బొమ్మను తయారు చేస్తారట. ఆ బొమ్మకు ముందుగా సేకరించిన జుట్టును, దుస్తులను చుట్టి ఆ బొమ్మను చేతబడి చేసే వ్యక్తికి ప్రతిరూపంగా మారుస్తారట. ఇలా చేతబడి చేసే తాంత్రికుడు అర్థరాత్రి శ్మశానంలో ముగ్గు వేసి దానిని ఆ ముగ్గులో ఉంచి నగ్నంగా కొన్ని రోజుల పాటు క్షుద్ర పూజలు చేస్తాడట. ఇలా కొన్ని రోజుల పాటు తాంత్రిక పూజలు చేసి భూత ప్రేత పిశాచాలను ప్రేరేపించి ఆ క్షుద్ర శక్తిని నిమ్మకాయలు, ఎండు మిరపకాయలతో కట్టిన ఎర్రని మూటలోకి అవహన చేస్తారట.
ఈ మూటను చేతబడి చేయాలనుకునే వ్యక్తి ఇంటి ప్రదేశంలో గొయ్యి తీసి దానిని కప్పి పెడతారట. అప్పటి నుండి ఆ మూటనుండి వచ్చే క్షుద్ర శక్తి ఆ వ్యక్తి మీద ప్రభావం చూపించడం మొదలు పెడుతుందట. ప్రయోగం చేయబడ్డ వ్యక్తి కృంగి కృశిస్తుండగా చివరకు తాంత్రికుడు ముగ్గులో ఉంచిన బొమ్మకు గండు సూది గుచ్చుతాడట. ఇలా గుచ్చిన కొద్ది రోజుల్లోపు ఆ వ్యక్తి మరణిస్తాడట. ఇదీ.. చేతబడి చేసే విధానం. మరి చేతబడి జరిగిందా లేదా తెలుసుకోవడం ఎలా సందేహం కూడా కలుగుతుంది. దీనికి తాంత్రికులు కొన్ని లక్షణాలను చెబుతున్నారు. చేతబడికి గురైన వ్యక్తి వింతవింతగా ప్రవర్తిస్తూ ఉన్నట్టుండి బిగ్గరగా అరుస్తూ ఉంటాడట. వారిలో వారు నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారట. రోజురోజుకి అన్నం మీద ద్వేషం కలిగి ఏమీ తినకుండా అలాగే ఉంటారట.
అలాగే ముఖం మీద ఎర్రగా బొబ్బలు వస్తాయట. మరి నిజంగా చేతబడి ఉందా అంటే ప్రతి మనిషి చుట్టూ కంటికి కనిపించని శక్తి వలయం ఉంటుంది. మన వేలి ముద్రలు ఎలాగైతే వేరుగా ఉంటాయో అదే విధంగా మన చుట్టూ ఉండే వలయం కూడా వేరుగా మరొకరితో సంబంధం లేకుండా ఉంటుంది. మన మనస్తత్వం, ఆలోచనల మూలంగానే ఈ వలయం బలంగా, బలహీనంగా ఉండడం జరుగుతుంది. ఈ వలయం దృఢంగా ఉన్న వారిపై ఎటువంటి ప్రతికూల శక్తి కూడా ప్రభావం చూపలేదు. ప్రతి దానికి నెగెటివ్ గా ఆలోచిస్తూ ప్రతి చిన్న దానికీ భయపడే వారి చుట్టూ ఉండే వలయం చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారిపైన బయటనుండి వచ్చిన నెగెటివ్ ఎనర్జీ వారి రక్షణ వలయాన్ని చేధించుకుని వారిపై ప్రభావాన్ని చూపించడం మొదలు పెడుతుంది.
జుట్టులో జీవశక్తి ఎక్కువగా ఉంటుంది. తాంత్రికుడు వీటితో ఒక బొమ్మను తయారు చేసి చేతబడి చేయబడిన వ్యక్తికి, బొమ్మకు బలమైన తాడును ఏర్పరుస్తాడు. అప్పుడు ఆ బొమ్మ రిమోట్ అయితే చేతబడి చేయబడిన వ్యక్తి రిసీవర్ లా మారతాడు. ఆవాహన చేసిన శక్తిని మంత్రాలతో శబ్ద తరంగాలు సృష్టించి దానిని ప్రతికూల శక్తిగా మార్చి ఆ వ్యక్తి మీదకు పంపిస్తాడు. శబ్ద తరంగాలతో శక్తిని ఎలా ప్రతికూలంగా మార్చాలో అధర్వణ వేదంలో విపులంగా చెప్పబడింది. ఇంతకీ చేతబడి చేసి ఒక వ్యక్తిని చంపగలమా అంటే కచ్చితంగా కుదరదనే చెప్పాలి.
మనిషికి కష్ట నష్టాలు వచ్చినప్పుడు మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారతాడు. ఎలా ఈ బాధల నుండి బయటపడాలా అని పదే పదే ఆలోచిస్తూ ఎవరు దేని గురించి చెప్పినా సులభంగా నమ్మేస్తూ ఉంటాడు. ఈభయమే చేతబడి చేసే వారి ప్రధాన ఆయుధం. చేతబడి చేయించిన వారు ఆ వ్యక్తి ఇంట్లో నిమ్మకాయలు, ఎముకలు కనబడేలా చేసి నీకు ఏదో ప్రయోగం జరిగిందని భయపడేలా చేస్తారు. ప్రతికూల శక్తి కంటే అతని భయమే అతన్ని మానసికంగా, శారీరకంగా బలహీనం చేసి చివరకి మరణించేలా చేస్తుంది. పాజిటివ్ గా ఆలోచించే వారిపైన ఎలాంటి ప్రయోగాలు పని చేయవు.