Dondakaya Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో దొండకాయలు కూడా ఒకటి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, తల తిరగడాన్ని తగ్గించడంలో, శరీరంలో మెటబాలిజం రేటును పెంచడంలో దొండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. వీటతో మనం అనేక రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే దొండకాయలతో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అర కిలో, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, గరం మసాలా – పావు టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చింతపండు – 10 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
దొండకాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, ధనియాలను, నువ్వులు, జీలకర్ర, కొబ్బరి పొడి ని ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లో వేయాలి. ఇందులోనే ఉప్పు, కారం, చింతపండు, గరం మసాలా కొద్దిగా నీటిని పోసి మరీ పలుచగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లను తీసేయాలి. ఇప్పుడు దొండకాయలను చివరి వరకు కట్ చేయకుండా కింద అతుకు ఉండేలా నాలుగు భాగాలుగా చేసి అందులో ముందుగా పేస్ట్ లా చేసుకున్న మిశ్రమాన్ని పెట్టాలి. ఇలా అన్ని దొండకాయలల్లోనూ మసాలా మిశ్రమం ఉంచిన తరువాత కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.
ఇవి వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు మసాలా మిశ్రమాన్ని ఉంచిన దొండకాయలను వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత మిగిలిన మసాలా మిశ్రమాన్ని వేసి, తగినన్ని నీళ్లను పోసి కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కర్రీ తయారవుతుంది. ఈ కర్రీని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా దొండకాయల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.