Dondakaya Tomato Pachadi : మనం పచ్చడి చేసుకోదగిన కూరగాయలల్లో దొండకాయలు కూడా ఒకటి. దొండకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా దొండకాయలతో మనం మరింత రుచిగా కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. దొండకాయలు, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఈ పచ్చడిని చాలా తేలికగా, చాలా తక్కువ సమయంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. లొట్టలేసుకుంటే తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ దొండకాయ టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారికీ కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 10 నుండి 15, కొత్తిమీర – గుప్పెడు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ముక్కలుగా తరిగిన దొండకాయలు – పావుకిలో, తరిగిన టమాటాలు – 4, చింతపండు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన ఉల్లిపాయ – 1.
దొండకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో దొండకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలను మెత్తగా మగ్గించాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన దొండకాయ, టమాట ముక్కలు వేసి పల్స్ ఇస్తూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడిని తాళింపు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దోశ, ఊతప్పం, ఉప్మా వంటి అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు.