Dora Cake : డోరా కేక్.. డోరా కార్టూన్ లో కనిపించే ఈ డోరా కేక్ చూస్తూనే తినాలనిపిస్తుందని చెప్పవచ్చు. పిల్లలు అప్పుడప్పుడూ ఈ కేక్ కావాలని అడుగుతూ ఉంటారు. ఈ డోరా కేక్ ను అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఎప్పుడూ ఒకేరకం కేక్ లు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి పెట్టవచ్చు. ఈ కేక్ ను మనం కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా లేదా అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. డోరా కేక్ ను చాలా సులభంగా,రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డోరా కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి లేదా గోధుమపిండి – ఒక కప్పు, పందచార పొడి – అర కప్పు, పాలపొడి – పావు కప్పు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, తేనె – ఒక టేబుల్ స్పూన్, చాక్లెట్ సిరప్ – కొద్దిగా.
డోరా కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార పొడి, పాలపొడి, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తరువత పాలు పోసి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. తరువాత వెనీలా ఎసెన్స్, తేనె వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని ఉంచి దానిపై కొద్దిగా నూనెను లేదా నెయ్యిని వేసుకోవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి.తరువాత దీనిని మరో వైపుకు తిప్పుకుని మూత పెట్టి మరో అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ముందుగా ఒక పాన్ కేక్ ను తీసుకుని దానిపై చాక్లెట్ సిరప్ ను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై మరో పాన్ కేక్ ను ఉంచి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డోరా కేక్ తయారవుతుంది. ఇలా తయారు చేసిన డోరా కేక్ ను పిల్లలతో పాటు ఇంట్లో కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.