Dosa Pindi Bonda : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో దోశలు కూడా ఒకటి. దోశలు చాలా రుచిగాఉంటాయి. చాలా మంది దోశలను ఇష్టంగా తింటారు. అయితే మనం తయారు చేసిన దోశపిండి ఒక్కొసారి ఎక్కువగా మిగిలి పోతూ ఉంటుంది. అలా అనీ రోజూ దోశలనే తినలేము. పిండిని పారేయలేము. అలాంటప్పుడు మిగిలిన దోశపిండిని పడేయకుండా దానితో ఎంతో రుచిగా, క్రిస్పీగాఉండే బోండాలను తయారు చేసుకోవచ్చు. ఈ బోండాలను తయారు చేయడం చాలా సులభం. దోశపిండితో తయారు చేసిన ఈ బోండాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దోశపిండితో రుచిగా, క్రిస్పీగా ఉండే బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోశ పిండి బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశపిండి – ఒకటిన్నర కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
దోశ పిండి బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో దోశపిండిని తీసుకోవాలి. తరువాత బియ్యంపిండి, మైదాపిండి వేసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. తరువాత పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు పిండిని 3 నుండి 4 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని బోండాలుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకునిప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోశపిండి బోండాలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మిగిలిన దోశపిండితో అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన బోండాలను తయారు చేసుకుని తినవచ్చు.