Dry Fruit Laddu Without Sugar : డ్రై ఫ్రూట్ లడ్డూ.. డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ లడ్డూ చాలా రుచిగా ఉంటుంది. పంచదార వేయకుండా చేసేఈ లడ్డూలను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. వీటిని పిల్లలకు రోజుకు ఒకటి చొప్పున ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు, రక్తహీనతతో బాధపడే వారు, నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారు ఈ లడ్డూను తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కమ్మటి డ్రై ఫ్రూట్ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, గోంధ్ – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, బాదంపప్పు పలుకులు – పావు కప్పు, పిస్తా పప్పు – పావు కప్పు, ఖర్బూజ గింజలు – పావు కప్పు, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుకొబ్బరి పొడి – పావు కప్పు, ఖరర్జూర పండ్లు – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, జాజికాయ పొడి – పావు టీ స్పూన్.
డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోంధ్ వేసి వేయించాలి. గోంధ్ పొంగిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు పలుకులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత బాదంపలుకులు, పిస్తా పప్పు, ఖర్బూజ గింజలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత గసగసాలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఎండుకొబ్బరి పొడి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వేయించిన గోంధ్ ను పొడిగా చేసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. తరువాత జార్ లో ఖర్జూర పండ్లను వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు కళాయిలో మిక్సీ పట్టుకున్న ఖర్జూర మిశ్రమంతో పాటు వేయించిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇందులోనే యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 10 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తో లడ్డూలను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.