Dry Fruit Sharbat : డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడంతో పాటు వీటితో మనం లడ్డూలను కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే డ్రై ఫ్రూట్స్ తో మనం చల్ల చల్లగా షర్బత్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ షర్బత్ వేసవి కాలంలో తాగడానికి చాలా చక్కగాఉంటుంది. దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఎండ వల్ల కలిగే నీరసం బారిన పడకుండా ఉంటాము. రుచిగా, చల్లచల్లగాడ్రై ఫ్రూట్స్ తో షర్బత్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు – 20, జీడిపప్పు – 20, పిస్తాపప్పు – ఒక టేబుల్ స్పూన్, అంజీర పండ్లు – 2, కాచి చల్లార్చిన పాలు – తగినన్ని, చిక్కటి పాలు – ఒకటిన్నర లీటర్, కుంకుమ పువ్వు – చిటికెడు, పంచదార – ముప్పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్.
డ్రై ఫ్రూట్స్ షర్బత్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో అవి మునిగే వరకు వేడి వేడి నీటిని పోయాలి. తరువాత వీటిని 20 నిమిషాల పాటు చక్కగా నానబెట్టాలి. తరువాత బాదంపప్పుపై ఉండే పొట్టును తీసేసి వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులో తగినన్ని కాచి చల్లార్చిన పాలను పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో పాలు పోసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. పాలు ఒక పొంగు వచ్చిన తరువాత ఇందులో కుంకుమ పువ్వు వేసి కలపాలి. తరువాత మంటను చిన్నగా చేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ను వేసి కలపాలి. దీనిని ఉండలు కట్టకుండా కలుపుకున్న తరువాత పంచదార వేసి కలపాలి. తరువాత ఈ పాలను 3 నిమిషాల పాటు మరిగించాలి. పాలు మరుగుతుండగానేమరో గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు కాచి చల్లార్చిన పాలను పోసి కలపాలి.
దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ మరిగించిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పాలను ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత వీటిని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత చల్ల చల్లగా గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ షర్బత్ తయారవుతుంది. దీనిని చల్ల చల్లగా తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనాన్ని పొందడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.