Dry Fruits Milk Shake : డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని నేరుగా తీసుకోవడంతో పాటు డ్రై ఫ్రూట్స్ తో మిల్క్ షేక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకు ఇలా వాటితో మిల్క్ షేక్ ను తయారు చేసి ఇవ్వడం వల్ల పోషకాలను చక్కగా అందించవచ్చు. రక్తహీనత, క్యాల్షియం లోపం వంటి సమస్యలతో బాధపడే వారు గర్భిణీ స్త్రీలు ఈ మిల్క్ షేక్ ను తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఈ మిల్క్ షేక్ ను తయారు చేయడం చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు – 8, జీడిపప్పు – 15, అంజీర్ – 4, ఖర్జూర పండ్లు – 5, వేడి నీళ్లు – తగినన్ని, కాచి చల్లార్చిన ఫ్రిజ్ లో ఉంచిన చల్లటి పాలు – అరలీటర్, పంచదార – పావు కప్పు, రోస్ వాటర్ – పావు టీ స్పూన్.
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్ వేసి వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తరువాత పాలు, పంచదార, రోస్ వాటర్ వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిల్క్ షేక్ ను గ్లాస్ లో పోసి పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారవుతుంది. ఇందులో పంచదారకు బదులు తేనె కూడా వేసుకోవచ్చు. అలాగేరోస్ వాటర్ కు బదులుగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తో మిల్క్ షేక్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ మిల్క్ షేక్ ను అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.