Dry Fruits Milkshake : మిల్క్ షేక్స్.. వీటిని ఇష్టపడిని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవి నుండి ఉపశమనాన్ని అందించడంతో పాటు మనకు రుచిని కూడా అందిస్తాయి. మనం కూడా వివిధ రకాల మిల్క్ షేక్స్ ను ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన మిల్క్ షేక్ వెరైటీలలో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా ఒకటి. డ్రై ఫ్రూట్స్ తో చేసే ఈ మిల్క్ షేక్ చాలా కమ్మగా ఉంటుంది. ఈ మిల్క్ షేక్ ను ఎంత తాగిన ఇంకా తాగాలనిపిస్తుందనే చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో కమ్మగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదం పప్పు – పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పిస్తా పప్పు – పావు కప్పు, ఎండు ద్రాక్ష – పావు కప్పు, ఖర్జూరాలు – 8, అంజీర్ – 4, కుంకుమ పువ్వు – చిటికెడు, చల్లని సోయా పాలు – రెండు కప్పులు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – ఒక టీ స్పూన్, పంచదార – తగినంత, ఐస్ క్యూబ్స్ – 5.
డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ తయారీ విధానం..
ముందుగా అంజీరాలను వేడి నరీటిలో వేసి అర గంట పాటు నానబెట్టాలి. తరువాత జీడిపప్పు, బాదం పప్పును కూడా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే మిగిలిన డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన అంజీర్, పావు కప్పు సోయా పాలు, కుంకుమ పువ్వు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత మిగిలిన పాలు, పంచదార, ఐస్ క్యూబ్స్ కూడా వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ గ్లాస్ లో ఈ మిల్క్ షేక్ ను పోసి పైన డ్రైఫ్రూట్ ముక్కలను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారవుతుంది. ఇందులో సోయా పాలకు బదులుగా మామూలు పాలను కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా మిల్క్ షేక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వేసవిలో ఈవిధంగా మిల్క్ షేక్ ను తయారు చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల వారికి ఆరోగ్యంతో పాటు వేసవి నుండి ఉపశమనాన్ని కూడా అందించవచ్చు.