Egg Biryani Recipe : మనకు రెస్టారెంట్ లలో లభించే బిర్యానీ వెరైటీలల్లో ఎగ్ ధమ్ బిర్యానీ కూడా ఒకటి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. రైతా, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఫంక్షన్ లల్లో కూడా దీనిని సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, ఇంట్లో జరిగే పార్టీలల్లో దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి- ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, బిర్యానీ ఆకులు – 2, మరాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, జీలకర్ర – అర టీ స్పూన్,చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – 3, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 10, టమాటా – పెద్దది ఒకటి, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – పావు కప్పుతరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, కసూరిమెంతి – అర టీ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కుంకుమ పువ్వు నీళ్లు – ఒక టేబుల్ స్పూన్, కెవ్రా వాటర్ లేదా రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – అరకిలో, నీళ్లు – రెండున్నర లీటర్లు, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, యాలకులు – 3, మరాఠీ మొగ్గ – 1, సాజీరా – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
ఎగ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కోడిగుడ్లకు గాట్లు పెట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసికలిపి పక్కకు ఉంచాలి. తరువాత అన్నం తయారీకి గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే మసాలా దినుసులు, ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టిన బియ్యం, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని 80 శాతం ఉడికించి వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కోడిగుడ్లు వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే గిన్నెలో మరో టేబుల్ స్పూన్ నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ గా చేసి వేసుకోవాలి. వీటిని బాగా వేయించిన తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన కోడిగుడ్లు, కొత్తిమీర, పుదీనా, కసూరిమెంతి వేసి కలపాలి. 2 నిమిషాల పాటు వేయించిన తరువాత బ్రౌన్ ఆనియన్స్ వేసికలపాలి. తరువాత బిర్యానీమసాలా, యాలకుల పొడి వేసికలపాలి. తరువాత ప్రెష్ క్రీమ్ వేసి కలపాలి. గ్రేవీ చక్కగా ఉడికిన తరువాత ఇందులో నుండి సగం గ్రేవీని అలాగే కోడిగుడ్లను తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఉడికించిన అన్నంలో నుండి సగం అన్నాన్ని ఒక లేయర్ గా వేసుకోవాలి.
తరువాత దీనిపై కోడిగుడ్లను మిగిలిన గ్రేవీని వేసుకోవాలి. తరువాత మిగిలిన అన్నాన్ని లేయర్ గా వేసుకోవాలి. తరువాత దీనిపై పచ్చిమిర్చి ముక్కలు, కుంకుమ పువ్వు నీళ్లు, కెవ్రా వాటర్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. తరువాత టిష్యూ పేపర్స్ ను ఉంచి వాటిపై నుండి నీటిని చల్లుకోవాలి. ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ధమ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత టిష్యూ పేపర్ తీసేసి మూత పెట్టి దీనిని మరో 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. దీనిని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ దమ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.