Egg Bonda : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో ఎగ్ బోండా కూడా ఒకటి. ఎగ్ బోండా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీ కోటింగ్ తో లోపల ఎగ్ తో ఈ బోండాలు చాలా చాలా రుచిగాఉంటాయి. స్ట్రీట్ స్టైల్ లో ఈ బోండాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు ఎగ్ బోండాలను తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన బఠాణీ – అర కప్పు, తరిగిన పెద్ద టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీస్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, పల్లీలు – అర కప్పు, కార్న్ ఫ్లేక్స్ – అర కప్పు, శనగపిండి – ముప్పావు కప్పు, వంటసోడా – చిటికెడు, వాము – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కసూరి మెంతి – కొద్దిగా, ఉడికించిన కోడిగుడ్లు – 6.
ఎగ్ బోండా తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బఠాణీ, నీళ్లు, ఉప్పు, కారం, టమాట ముక్కలు, పసుపు వేసి మూత పెట్టాలి. ఈ బఠాణీలను పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి వీటిని కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. తరువాత అవసరమైతే మరికొద్దిగా నీళ్లు పోసి మరలా స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఇందులోనే చాట్ మసాలా వేసి కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, వంటసోడా, వాము, ధనియాల పొడి, కొత్తిమీర, కసూరిమెంతి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. దీనిని 3 ఉండి 4 నిమిషాల పాటు బాగా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక పల్లీలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ గుడ్లను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ బోండాలను రెండు ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వీటిపై ముందుగా తయారు చేసుకున్న బఠానీ చాట్ ను వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టమాట ముక్కలు, వేయించిన పల్లీలు,కార్న్ ఫ్లేక్స్ వేసుకోవాలి. తరువాత కొద్దిగా, ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లి సర్వ్ చేసుకోవాలి. అవసరమైతే దీనిపై నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఎగ్ బోండాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా ఎగ్ బోండాలను తయారు చేసి తీసుకోవచ్చు.