Egg Chips : కోడిగుడ్లతో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. కకోడిగుడ్లతో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. తరచూ చేసే చిరుతిళ్లే కాకుండా కోడిగుడ్లతో మనం చిప్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసే చిప్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చక్కగా ఉంటాయి. ఈ చిప్స్ ను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే చిప్స్ ను అందరికి నచ్చేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 2, బంగాళాదుంపలు – 2, ఉప్పు – తగినంత, కారం – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కోడిగుడ్డు చిప్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి వాటిని చిప్స్ ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం వేసి బీటర్ తో బీట్ చేసుకోవాలి. బీటర్ లేని వారు వీటిని జార్ లో వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప చిప్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ చిప్స్ ను మధ్యస్థ మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్డు చిప్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ చిప్స్ కొద్దిగా మెత్తగా ఉంటాయి. మరీ అంతా కరకరలాడుతూ ఉండవు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.