Egg Pepper Masala : మనకు ధాబాలలో లభించే ఎగ్ వెరైటీలలో ఎగ్ పెప్పర్ మసాలా కర్రీ కూడా ఒకటి. కోడిగుడ్లతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. ఈ ఎగ్ పెప్పర్ మసాలా కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్లతో వెరైటీ వంటకాలను తినాలనుకునే వారు ఈ కూరను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ ఎగ్ పెప్పర్ మసాలాను ధాబా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పెప్పర్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన టమాటాలు – 4, తరిగిన ఉల్లిపాయలు – 2, పచ్చిమిర్చి – 3, నూనె – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్, ఎండుమిర్చి లేదా కాశ్మీరి మిర్చి – 4.
ఎగ్ ఫ్రైకు కావల్సిన పదార్థాలు..
ఉడికించిన కోడిగుడ్లు – 6, , బటర్ – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ -1, ఉప్పు – కొద్దిగా.
ఎగ్ పెప్పర్ మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలాకు కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని గిన్నెలోకి తీసుకుని అదే జార్ లో టమాటాలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కోడిగుడ్లను నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో వీటిని ఫ్రై చేసుకోవడానికి కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉప్పు, కారం చల్లుకోవాలి. తరువాత కోడిగుడ్డు ముక్కలను వేసి అటూ ఇటూ తిప్పుతూ 3 నుండి 4 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు తయారు చేసుకోవడానికి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వేయించిన కోడిగుడ్లను ఉల్లిపాయలతో సహా వేసుకోవాలి. తరువాత మతూ పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పెప్పర్ మసాలా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, జీరా రైస్ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.