Egg Samosa : మనలో చాలా మందికి భోజనంలో ఎదో ఒక రూపంలో కోడి గుడ్డు లేనిదే ముద్ద దిగదు. ఆమ్లెట్ లా కానీ , ఫ్రై కానీ, ఉడికించి గానీ గుడ్డు ఉండాల్సిందే. గుడ్డు ఉంటే చాలు చాలా మంది ఏదో ఒక రకంగా వండుకొని తినేస్తూ ఉంటారు. ఎగ్ బిర్యానీ, ఎగ్ బుర్జీ, ఎగ్ మసాల కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవే కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా మనం రోజూ తినే వంటల్లో గుడ్డు ను వాడుతూనే ఉంటాం. మనం సాధారణంగా ఆలూ సమోసా, కార్న్ సమోసా, ఆనియన్ సమోసా లాంటివి తింటూనే ఉంటాం. కొత్తగా కావాలనుకనే వారు ఎగ్ తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రుచితో పాటు సులువుగా చేసుకోగలిగే ఎగ్ సమోసాను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
ఎగ్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు..
కోడి గుడ్లు- 6, ఆలుగడ్డ తురుము- 1 కప్పు, క్యారెట్ తురుము- 1 కప్పు, పచ్చిమిర్చి-2, బేకింగ్ పౌడర్- అర స్పూన్, ఉల్లిపాయలు-4, ఉల్లి గింజలు- అర స్పూన్, కొత్తి మీర- 1 కట్ట, మైదా- ఒకటిన్నర కప్పు, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.
ఎగ్ సమోసాలను తయారుచేసే విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, అర స్పూన్ ఉప్పు, ఉల్లి గింజలు వేసి కలిపి వాటితో పాటు ఒక స్పూన్ నూనె కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసి కలుపుతూ పూరీ పిండి లా కలుపుకొని మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టి అందులో మూడు చెంచాల నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. అవి వేగాక బంగాళదుంప, క్యారెట్ తురుము వేయాలి. కాసేపటి తరువాత తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, గుడ్ల సొన వేసి బాగా కలపాలి. అది కూర లాగా అయ్యాక స్టౌ మీద నుండి దింపి, స్టౌ పైన మరో కళాయి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె వేయాలి.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని తీసుకొని పూరీ లా వత్తుకొని దానిని మధ్యకు అర్ధ వృత్తాకారంలో చాకుతో కోయాలి. అలా కోసిన ఒక ముక్క తీసుకొని దానిపై ఒక స్పూన్ గుడ్డు మిశ్రమాన్ని ఉంచి సమోసా ఆకారం వచ్చేలా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని సమోసాలు తయారు చేసుకున్న తరువాత అప్పటికే వేడెక్కిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కరకరలాడే ఎగ్ సమోసాలు తినడానికి రెడీ అవుతాయి.