Eggless Rava Cake : కేక్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు మరీ ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు రకరకాల రుచుల్లో ఈ కేక్ లభిస్తుంది. అలాగే మనం ఇంట్లో కూడా కేక్ ను తయారు చేస్తూ ఉంటాం. మన ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా సులభంగా కూడా మనం ఈ కేక్ ను తయారు చేసుకోవచ్చు. అలాగే కేక్ తయారీలో మనం కోడిగుడ్లను ఉపయోగిస్తూ ఉంటాం. కోడిగుడ్లను ఉపయోగించకుండా రుచిగా రవ్వతో కేక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ లెస్ రవ్వ కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒకటింపావు కప్పు, నూనె – అర కప్పు, పెరుగు – అర కప్పు, పాలు – అర కప్పు, పంచదార పొడి – ఒక కప్పు, మైదా పిండి – అర కప్పు, పాలపొడి – 2 టీ స్పూన్స్, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – ఒక టీ స్పూన్, టూటీ ఫ్రూటీ – 2 టీ స్పూన్స్.
ఎగ్ లెస్ రవ్వ కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నూనెను తీసుకోవాలి. తరువాత అందులో పెరుగు, పాలు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో బొంబాయి రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ గిన్నెపై ఒక జల్లెడను ఉంచి అందులో పంచదార పొడి, మైదాపిండి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి. తరువాత ఇవి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇది అందుబాటులో లేని వారు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు.
తరువాత ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ మైదా పిండిని తీసుకుని అందులో టూటీ ఫ్రూటీని వేసి కలపాలి. ఈ టూటీ ఫ్రూటీకి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి కలుపుకోవచ్చు. తరువాత వీటిని కేక మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం గిన్నెను తీసుకుని దానికి ముందుగా నూనెను రాయాలి. తరువాత దానిపై కొద్దిగా మైదా పిండిని చల్లాలి. ఇలా తయారు చేసుకున్న ఈ అల్యూమినియం గిన్నెలో ముందుగా తయారు చేసిన కేక్ మిశ్రమాన్ని వేసి మధ్యలో గాలి బుడగలు లేకుండా కదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా అలాగే మందంగా ఉండే కళాయిని ఉంచి వేడి చేయాలి. కళాయి వేడయ్యాక అందులో స్టాండ్ ను ఉంచి దానిపై కేక్ గిన్నెను ఉంచాలి. దీనిపై ఆవిరి బయటకు పోకుండా మూతను ఉంచి చిన్న మంటపై 45 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత ఒక టూత్ పిక్ ను గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు ఏమి అంటుకోకుండా ఉంటే కేక్ ఉడికిందిగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ టూత్ పిక్ కు కేక్ అంటుకుంటే మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కేక్ ను గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెస్ రవ్వ కేక్ తయారవుతుంది. కేక్ తినాలనిపించినప్పుడు అలాగే ఎగ్ తినని వారు ఇలా ఎగ్ లెస్ రవ్వ కేక్ ను తయారు చేసుకుని తినవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.