Fish Curry : చేపల పులుసు.. దీని రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా మంది చేపల పులుసును ఇష్టంగా తింటారు. చేపల పులుసును తినడం వల్ల రుచితో పాటు చేపల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ చేపల పులుసును ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చేపల పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని తింటే మళ్లీ మళ్లీ ఇలాగే తయారు చేసుకుని తింటూ ఉంటారు. అలాగే మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – ఒకటిన్నర కిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, నూనె – పావు కప్పు, చింతపండు – 50 గ్రా., అల్లం – 25 గ్రా., ఎండు కొబ్బరి – 25 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – 50 గ్రా., ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 3, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, గరం మసాలా – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా.
చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి ముక్కలకు పట్టేలా చేత్తో బాగా కలిపి పక్కకు ఉంచాలి. తరువాత చింతపండులో ఒక గ్లాస్ నీటిని పోసి నానబెట్టాలి. చింతపండు నానిన తరువాత దాని నుండి రసాన్ని తీసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఇదే జార్ లో పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని అందులో చింతపండు రసం, మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి చేత్తో ముక్కలకు పట్టేలా కలపాలి.
తరువాత మరో పావు లీటర్ నీళ్లు పోసి నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి పెద్ద మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మరో పది నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారవుతుంది. దీనిని కొద్దిగా చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చేపల పులుసును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.