Almirah : మనిషి జీవితంలో ముఖ్యమైనవి ప్రేమానురాగాల తరువాత డబ్బే. నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డబ్బే ప్రేమానురాగాలను మించి పోతుంది. అలాంటి డబ్బును ఉంచే బీరువాను ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ గది ఎక్కడ ఉండాలో నిర్దేశించినట్టే బీరువా వంటి ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉండాలో మన పూర్వీకులు నిర్దేశించారు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో బరువు ఉంచకూడదని చెప్పినట్టే కొన్ని చోట్ల బరువు ఉంచాలని సూచించారు. ఇంట్లో నైరుతి భాగంలో బరువును ఉంచాలని చాలా మంది భావిస్తారు. కానీ ఈ దిశన బరువు పెట్టకూడదట. మన జీవితంలో అతి ముఖ్యమైన బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే వాయువ్యం చంద్రుడిది. చంద్రుడు ధనప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి డబ్బు, నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో అనగా పశ్చిమానికి, ఉత్తరానికి మధ్యన ఉండే మూలలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. అలాగే బీరువాను దక్షిణ దిక్కున చేసి పెట్టినా మంచిదట. కానీ బీరువా తెరిచినప్పుడు మన ముఖం ఉత్తరం వైపు చూస్తూ ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలను పాటించినట్టయితే ధన నష్టం కలగదు. అలాగే మన ఇంట్లోకి ఊహించని ధనం వచ్చి చేరుతుంది. అదేవిధంగా బీరువాను ఉత్తర దిక్కున ఉంచిన కూడా మంచే జరుగుతుందట. ఎందుకంటే ఉత్తరానికి అధిపతి బుదుడు. బుదుడు సంపదలకు అధిపతి. బీరువాను ఉత్తర దిక్కు మధ్య భాగంలో ఉంచిన కూడా మంచిదే.
కానీ బీరువా మాత్రం దక్షిణ ముఖమే చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువాను నైరుతి మూలలో ఉంచకూడదు. అలా చేస్తే మనకు ఎంత డబ్బు వచ్చిన కూడా నిల్వ ఉండదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుందట. సాధారణంగా చాలా మంది ఖరీదైన బట్టలను, ఇష్టమైన బట్టలను బీరువాలో పెట్టి పత్రాలను, డబ్బును బయట అల్మారాల్లో పెడుతుంటారు. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు. బీరువాలో పత్రాలను, డబ్బును, నగలను జాగ్రత్తగా పెట్టుకోవాలట. వీటిని చిందరవందరగా, ఇష్టం వచ్చినట్టు పడేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్టేనని అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు.
డబ్బుకు విలువ ఇచ్చి బట్టలను బీరువా కింది భాగంలో పెట్టుకోవడం మంచిది. అలాగే బీరువా తెరవగానే మంచి సువాసన వచ్చేలా చూసుకోవాలి. బీరువా తీయగానే బట్టల వాసన, కీటకాల వాసన వస్తే లక్ష్మీ దేవి కటాక్షం లభించదు. అలాగే బీరువా పైన ఒక వైపు పసుపు, కుంకుమ కలిపిన బొట్లు పెట్టాలి. దీనితో పాటు సవ్య దిశలో ఉండే స్వస్తిక్ గుర్తును ఉంచాలి. అలాగే లక్ష్మీ దేవి కూర్చొని ఉండి ఆమెకు ఇరువైపులా తొండం పైకెత్తిన ఏనుగులు ఉండే ఉండే బొమ్మను అతికిస్తే ఎంతో మంచి జరుగుతుంది. శుభానికి సంకేతమైన ఈ రెండు బొమ్మలను బీరువాపై ఉంచితే ఇంట్లో ధనానికి లోటు ఉండదు. లక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుంది.