Electricity Bill : మనకు ప్రతి నెలా ఉండే ఇంటి ఖర్చుల్లో కరెంట్ బిల్లు కూడా ఒకటి. కరెంట్ బిల్ ను చూడగానే చాలా మంది భయపడిపోతుంటారు. అమ్మో ఇంత బిల్ వచ్చిందా.. అని ఆశ్చర్యపోతుంటారు. వేసవిలో అయితే కరెంట్ బిల్ మరింత ఎక్కవగా వస్తుంది. మారుతున్న జీవన విధానికి అనుగుణంగా ప్రతి ఇంట్లోనూ విద్యుత్ ఉపకరణాల వాడకం ఎక్కువవుతోంది. సెల్ ఫోన్ ఛార్జర్ నుండి ఏసీ వరకు ఏదీ కూడా కరెంట్ లేనిదే ముందుకు నడవదు. ఎన్ని విద్యుత్ ఉపకరణాలను వాడితే బిల్ అంత ఎక్కువగా వస్తుంది. అలాగని వీటిని వాడకుండా ఉండలేం.
ఈ విద్యుత్ ఉపకరణాలను వాడుతూనే కరెంట్ బిల్ ను సగానికి సగం ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో ఎక్కువగా విద్యుత్ ను వినియోగించుకునే వాటిల్లో ఏసీ ఒకటి. వేసవిలో ఏసీని తప్పకుండా వాడుతూ ఉంటారు. ఏసీ ఉపయోగించుకునేటప్పుడు వాటి ఫిల్టర్ లను వారానికి ఒకసారి తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. అలాగే ఏసీ ని ఆన్ చేసిన తరువాత తలుపులను, కిటికీలను మూసే ఉంచాలి. వాటిని ఎక్కువగా తెరవకూడదు. తలుపులను తెరుస్తూ ఉండడం వల్ల బయటి వేడి లోపలికి వచ్చి గది ఉష్ణోగ్రతలు మారే అవకాశం ఉంటుంది.
ఏసీ ఉష్ఱోగ్రతను 25 నుండి 26 డిగ్రీల మధ్యనే ఉంచుకోవాలి. 16 నుండి 18 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను ఉంచుకోవడం వల్ల కంప్రెసర్ మీద ఒత్తిడి పడి విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. అలాగే మన ఇంట్లో ఉండే విద్యుత్ ఉపకరణాల్లో ఫ్రిజ్ కూడా ఒకటి. ఫ్రిజ్ ను వాడేటప్పుడు ఫ్రిజ్ తలుపును ఎక్కువ సమయం తీసి ఉంచకూడదు. అలాగే ఎక్కువ సార్లు కూడా తీయకూడదు. తరచూ ఫ్రిజ్ డోర్ ను తెరుస్తూ ఉండడం వల్ల ఉష్ణోగ్రత్తలో తేడా వచ్చి ఫ్రిజ్ చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువవుతుంది.
అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఫ్యాన్ తప్పకుండా ఉంటుంది. నాసిరకం ఫ్యాన్ లను వాడడం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి విద్యుత్ ఉపకరణాలను కొనుగోలు చేసేటప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉందో లేదో చూసుకోవాలి. 5 స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఇంట్లో వెలుగు కోసం ఎల్ఇడి బల్బులను మాత్రమే ఉపయోగించాలి. కూలర్ ను వాడే వారు వాటిని ఇంట్లో కిటికీల దగ్గర పెట్టుకోవాలి. వాటి గడ్డిని ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉండాలి.
అలాగే ఇన్వర్టర్ బ్యాటరీలను రెండు సంవత్సరాలకొకసారి మారుస్తూ ఉండాలి. ఈ బ్యాటరీల జీవిత కాలం పెరిగే కొద్దీ త్వరగా డిస్ ఛార్జ్ అయ్యి పదే పదే ఛార్జ్ అవుతూ ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. పాత తరం టీవీల స్థానంలో ఎల్ఇడి టీవీలను ఉపయోగించాలి. సెల్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని ఛార్జ్ చేయగానే స్విచ్ ను ఆఫ్ చేయాలి. అలాగే చిన్న చిన్న వాటికి కూడా మిక్సీ లను ఉపయోగించకూడదు. అవసరం ఉంటేనే ఫ్యాన్ లను, లైట్ లను వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించడం వల్ల మన విద్యుత్ వినియోగం చాలా వరకు నియంత్రణలోకి వస్తుంది. మన కరెంట్ బిల్ తక్కువగా రావడంతోపాటు విద్యుత్ ను ఆదా చేసిన వారం కూడా అవుతాము.