Mosquitoes : ఈ రోజుల్లో దోమల కారణంగా మనం పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా, పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ దోమలు అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దోమ కాటు చాలా ప్రమాదకరమైనది. దోమ కాటు కారణంగా మలేరియా, డెంగ్యూ, బోధకాలు వంటి విష జ్వరాల బారిన పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ దోమ కాటు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఇంట్లో శుభ్రంగా లేకపోవడం, ఇంటి చుట్టూ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, ఇంటి చుట్టు పక్కల నీటి నిల్వలు ఉండడం వంటి కారణాల చేత ఇంట్లో అదేవిధంగా ఇంటి పరిసరాలలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల బెడద నుండి తప్పించుకోవడానికి మనం స్ప్రేలు, మస్కిటో కాయిల్స్, రిఫిల్స్ వంటి వాటిని వాడుతున్నాం.
వీటిని వాడడం వల్ల తాత్కాలికంగా బయటపడిన ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. వీటి తయారీలో రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటిని పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దోమలను మనం సహజసిద్ద పద్దతుల్లో కూడా నివారించవచ్చు. దోమల బెడద నుండి బయటపడడానికి మనం సహజ పద్దతులను ఉపయోగించడమే ఉత్తమం. ఈ సహజ పద్దతులను వాడడం వల్ల దోమల బెడద తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. దోమలను తరిమికొట్టే ఒక అద్భుతమైన వంటింటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను పాటించడం వల్ల మనం దోమల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం లవంగం నూనెను, నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక శుభ్రమైన స్ప్రే బాటిల్ ను తీసుకుని దానిలో లవంగం నూనెను పోయాలి. తరువాత దానిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. దీనిని దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, గది మూలల్లో, ఇంటి ఆవరణలో స్ప్రే చేయాలి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు గంటలకొకసారి ఈ లవంగం నూనె స్ప్రే చేస్తూ ఉండాలి. లవంగం నూనె ఘాటుకు తట్టుకోకలేక దోమలు ఇంట్లో నుండి బయటకు పోతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే దోమల తెరలు వాడడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలకు, వెంటిలేటర్లకు తెరలు అమర్చుకోవడం వంటివి చేయాలి. అలాగే నీటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దోమ కాటుకు గురి కాకుండా ఉంటాం.