Gasagasala Kura : మనం వంటల్లో వాడే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. గసగసాలు కూరలకు చక్కటి రుచిని అందిస్తాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, నిద్రలేమిని తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గసగసాలు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు గసగసాలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. బాలింతలు ఈ కూరను తినడం వల్ల మరింత మేలు కలుగుతుంది. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ గసగసాల కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గసగసాల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
గసగసాలు – పావు కప్పు, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయలు – 2, నీళ్లు – తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, జీలకర్ర పొడి -అర టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి- 2, కరివేపాకు -ఒక రెమ్మ.
గసగసాల కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో గసగసాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత గసగసాల పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిని 5 నుండి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గసగసాల కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు గసగసాలతో కూరను తయారు చేసుకుని తినవచ్చు.