Godhumapindi Laddu : గోధుమపిండి లడ్డూలు.. గోధుమపిండితో చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ లడ్డూలను తయారు చేసుకోవడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు 15 నుండి 20 నిమిషాల్లోనే ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా చాలా తేలికగా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం స్వీట్స్ కాకుండా ఇలా గోధుమపిండితో రుచిగా, తేలికగా లడ్డూలను కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మన ఆరోగ్యానికి మేలు చేసే గోధుమపిండితో లడ్డూలను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, గోధుమపిండి – ఒక కప్పు, ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు, బెల్లం తురుము – అర కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక టీ గ్లాస్.
గోధుమపిండి లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో గోధుమపిండి, ఎండుకొబ్బరి పొడి వేసి వేయించాలి. దీనిని దోరగా, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించిన తరువాత బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పాలను పోస్తూ కలుపుకోవాలి. ఈ మిశ్రమం ఉండ చేయడానికి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి లడ్డూలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ లడ్డూలు 2 నుండి 3 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన గోధుమ లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.