Gongura Biryani : మనకు అందుబాటులో ఉండే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీంతో పచ్చడి, పప్పు వంటి వాటిని చేసుకుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మీకు తెలుసా.. గోంగూరతో బిర్యానీని కూడా తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. గోంగూరతో బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – ఒకటిన్నర కప్పు, గోంగూర – రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక టీస్పూను, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – ఆరు, కొత్తిమీర – కొంచెం, లవంగాలు – నాలుగు, దాల్చిన చెక్క – చిన్నముక్క, బిర్యానీ ఆకు – ఒకటి, నెయ్యి – ఒక టేబుల్ స్పూను, నూనె – ఒక టేబుల్ స్పూను, ఉప్పు, డ్రై ఫ్రూట్స్ – తగినంత.
గోంగూర బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఒక గిన్నెలో నూనె పోయండి. కోసి పెట్టిన గోంగూరను నూనెలో వేసి మెత్తగా ఉడికించండి. అనంతరం దాన్ని మిక్సీలో రుబ్బి పక్కన పెట్టండి. కుక్కర్ లో నెయ్యి పోసి దాంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు, లవంగాలు వేయండి. బాగా వేగే దాకా వాటిని వేగించండి. అవి వేగాక చిన్నగా తరిమిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి అవి వేగేదాకా ఆగండి. అనంతరం అల్లం పేస్ట్ వేసి మరికొంత సేపు వేయించండి.
కొంచెం ఘుమఘుమల వాసన వచ్చాక దాంట్లో గోంగూర పేస్ట్ వేసి బాగా కలపండి. చివరకు బాస్మతి బియ్యం వేసి దానికి సరిపడే నీళ్లు పోయండి. అనంతరం మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ను దించేయండి. ప్రెజర్ అంతా పోయే వరకు ఉండి.. తరువాత మూత తీయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలపండి. అంతే.. రుచికరమైన గోంగూర బిర్యానీ తయారైనట్లే. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా ఏదైనా కూరతో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.