Gongura Chepala Pulusu : గోంగూర చేపల పులుసు.. గోంగూర, చేపలు కలిపి చేసే ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, దోశ, ఊతప్పం వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ ఒకేరకం వంటకాలు తిని విసిగిపోయిన వారు ఇలా వెరైటీగా తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. సాధారణ చేపల పులుసు కంటే కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కూడా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. కమ్మగా, గోంగూర పులుపుతో రుచిగా ఉండే ఈ గోంగూర చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు- ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన ఎర్ర గోంగూర – ఒక కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, వేయించిన మెంతి పిండి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ముప్పావు టీ స్పూన్, పుల్లటి టమాటాలు – 2, నీళ్లు – 350 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల ఫ్రై తలయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – అరకిలో, ఉప్పు – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నూనె – 1/3 కప్పు.
గోంగూర చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత గోంగూర తరుగు వేసి వేయించాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించిన తరువాత ఉప్పు, పసుపు, కారం, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. పులుసు మరిగిన తరువాత చేప ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత మూత పెట్టి చిన్నమంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర చేపల పులుసు తయారవుతుంది. ఇందులో పులుసు చాలని వారు 50 ఎమ్ ఎల్ చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది.