Gongura Endu Royyalu : గోంగూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. గోంగూరను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుంది. బరువు తగ్గడంలో కూడా గోంగూర ఎంతో మేలు చేస్తుంది. గోంగూరతో పప్పు, పచ్చడే కాకుండా నాన్ వెజ్ వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. గోంగూరతో చేసే నాన్ వెజ్ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. గోంగూరతో చికెన్ నే కాకుండా మనం ఎండు రొయ్యలను కలిపి కూడా వండుకోవచ్చు. గోంగూర ఎండు రొయ్యలు కలిపి చేసే ఈ ఇగురు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్యల ఇగురును ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర ఎండు రొయ్యల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – ఒక కట్ట, ఎండు రొయ్యలు – పావు కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి -5, కరివేపాకు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, పసుపు – కొద్దిగా.
గోంగూర ఎండు రొయ్యల ఇగురు తయారీ విధానం..
ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత రొయ్యల తలలు, తోకలు తేసేసి శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చిని వేసుకోవాలి. తరువాత గోంగూర వేసి మూత పెట్టి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి గోంగూరను మెత్తగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి. తరువాత ఈ గోంగూరను జార్ లో వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత రొయ్యలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూర, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్యల ఇగురు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.