Gongura Ullikaram : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోంగూరను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. గోంగూరతో ఎక్కువగా చేసే వంటకాల్లో గోంగూర పచ్చడి కూడా ఒకటి. గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా గోంగూర, ఉల్లిపాయలు కలిపి చేసే గోంగూర ఉల్లికారం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర ఉల్లికారం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర కట్టలు – పెద్దవి రెండు, మెంతులు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిపాయలు – పెద్దవి రెండు, కారం – 2 టీ స్పూన్స్, వెల్లుల్లి రెమ్మలు – 15, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
గోంగూర ఉల్లికారం పచ్చడి తయారీ విధానం..
ముందుగా గొంగూరను తెంచి శుభ్రంగా కడిగి నీరంతా పోయేలా చేసుకోవాలి. తరువాత కళాయిలో మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత గోంగూర వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి గోంగూరను మెత్తగా మగ్గించాలి. గోంగూర మగ్గిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ ఉల్లిపాయ మిశ్రమం వేసి కలపాలి.
దీనిని మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో కమ్మగా ఉండే గోంగూర ఉల్లికారం తయారవుతుంది. ఇది బయట ఉంచి నిల్వ చేయడం వల్ల వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల మరింత కొంతకాలం తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన గోంగూర పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.