Gongura Yendu Royyalu : గోంగూర ఎండు రొయ్యల కర్రీ.. ఎండు రొయ్యలు, గోంగూర కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎండురొయ్యలతో ఎక్కువగా కూర, పులుసు, ఇగురు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఎండు రొయ్యల్లో గోంగూర వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ గోంగూ ఎండు రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర ఎండు రొయ్యల కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు రొయ్యలు – 200 గ్రా., నీళ్లు – అరలీటర్నూనె – అర కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీస్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – 2రెమ్మలు, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎర్ర గోంగూర ఆకులు – 2 కట్టలు, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
గోంగూర ఎండు రొయ్యల కర్రీ తయారీ విధానం..
ముందుగా ఎండురొయ్యలను తల, తోక తీసేసి శుభ్రం చేసుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి అందులో రొయ్యలు వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని చల్లటి నీటిలో వేసి బాగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి.
తరువాత రొయ్యలు వేసి వేయించాలి. వీటిని 12 నుండి 15 నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత గోంగూర ఆకులు వేసి కలపాలి. గోంగూర ఆకులు పూర్తిగా దగ్గర పడే వరకు మగ్గించాలి. ఇలా 15 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కర్రీ తయారవుతుంది. ఈ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. గోంగూరతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.