Goru Chikkudu Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరుచిక్కుడు కాయలు కూడా ఒకటి. గోరు చిక్కుడు కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర కూరగాయల వలె వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. గోరు చిక్కుడు కాయలతో మనం ఎక్కువగా వేపుడు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము.గోరు చిక్కుడు వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎండుకారమే కాకుండా పచ్చికారం వేసి కూడా ఈ ఫ్రైను తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి, పచ్చికారం వేసి ఈ గోరుచిక్కుడు వేపుడును మరింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు చిక్కుడు ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 6 లేదా కారానికి తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 5, పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి -2, కరివేపాకు -ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్,ఉప్పు – తగినంత, ఉడికించిన గోరు చిక్కుడు కాయలు – పావుకిలో, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
గోరు చిక్కుడు ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉడికించిన గోరు చిక్కుడు ముక్కలు వేసి కలపాలి. వీటిని మరో 3 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడు ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.