Gujarati Dal : ఎన్నో రకాల శాఖాహార వంటలకు గుజరాత్ పెట్టింది పేరు. ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ లో శాఖాహారులు ఎక్కువ. అక్కడి ఆహారంలో శాఖాహార గుజరాతీ థాలీకి ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఢోక్లా, ఖాక్ర, బాసుంది, షీర్కండ్, పత్రా ఇలా ఎన్నో పేరొందిన వంటలు ఉన్నాయి. అలాగే వీటిలో చెప్పుకోదగ్గ మరో శాఖాహార వంటకం గుజరాతీ దాల్. ఎన్నో పోషక విలువలతో పాటు సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
గుజరాతీ దాల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు..
కందిపప్పు – 1 కప్పు, నీళ్లు- రెండున్నర కప్పులు, టమాట- 1, పచ్చిమిర్చి- 2, అల్లం ముద్ద- అర స్పూన్, కొత్తిమీర తురుము- అర కప్పు, పసుపు- అర స్పూన్, కారం- అర స్పూన్, నూనె- తగినంత, తాళింపు గింజలు- 1 స్పూన్, కరివేపాకు- 1 రెబ్బ, ఇంగువ – చిటికెడు, బెల్లం- చిన్న ముక్క, లవంగాలు 4, ఉప్పు- తగినంత.

గుజరాతీ దాల్ ను తయారు చేసే విధానం..
ముందుగా కందిపప్పును కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, అల్లం, లవంగాలు, పసుపు, ఉప్పు, కారం, బెల్లం, టమాట ముక్కలు వేసి బాగా కలిపి 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. పప్పు దగ్గరగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ లో నూనె వేసి అది కాగాక అందులో తాళింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఈ పోపును పప్పుపై వేసి కొత్తిమీర తురుము కూడా వేయాలి. దీంతో గుజరాతీ దాల్ రెడీ అయినట్లే. ఇది చపాతీలతో పాటు అన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది.