Guntur Karam Podi : గుంటూరు కారం పొడి.. ఎండుమిర్చితో పాటు ఇతర దినుసులు కలిపి చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం పొడిని ఇడ్లీ, దోశ వంటి వాటితో నెయ్యి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యితో కూడా ఈ కారం పొడిని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం తరుచూ చేసే కారంపొడుల కంటే ఈ కారం పొడి మరింత రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ గుంటూరు కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటూరు కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 10, చింతపండు – చిన్న ఉసిరికాయంత, ఎండమిర్చి – 50 గ్రా., ఉప్పు – తగినంత.
గుంటూరు కారం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కందిపప్పు, మినపప్పు, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండుమిర్చివేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుంటూరు కారం తయారవుతుంది. ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు పడితే అప్పుడు ఈ కారం పొడిని ఉపయోగించుకోవచ్చు.