Gutti Kakarakaya : చేదుగా ఉన్నప్పటికి కాకరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, కంటిని చూపును మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా కాకరకాయలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కాకరకాయలతో వేపుడు,పులుసు, కూర వంటి వాటినే కాకుండా స్టఫ్డ్ కాకరకాయ కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. దీనిని ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే ఈ స్టఫ్డ్ కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టఫ్డ్ కాకరకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయ – పావుకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చింతపండు రసం – అర కప్పు.
కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
స్టఫ్డ్ కాకరకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసి వేయాలి. తరువాత వీటికి నిలువుగా గాట్లు పెట్టి లోపల ఉండే గింజలను తీసివేయాలి. తరువాత ఈ కాకరకాయలకు లోపల, బయట ఉప్పును బాగా పట్టించాలి. తరువాత వీటిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పొడిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కాకరకాయలను చేత్తో చేదు అంతా పోయేలా పిండాలి. తరువాత వీటిని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడిని కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయలను వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని వేయించాలి. ఇలా కాకరకాయలను క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తరువాత మిగిలిన కారం పొడిని వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు రసం వేసి కలపాలి. తరువాత మూత పెట్టి కాకరకాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ కాకరకాయ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటారు.