Harabara Kebab : హరా బారా కబాబ్.. బంగాళాదుంపలతో చేసే ఈ వెజ్ కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్టాటర్ గా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ కబాబ్స్ ను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. వేడి వేడి స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతోరుచిగా, క్రిస్సీగా ఉండే హరాబారా కబాబ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకికావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హరా బారా కబాబ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2( పెద్దవి), పాలకూర పేస్ట్ – పావు కప్పు, పచ్చి బఠాణీ పేస్ట్ – పావు కప్పు, పనీర్ తురుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, మిరియాల పొడి – అర టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
హరా బారా కబాబ్ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను తురుము గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నీరు వేయకుండా అంతా కలిసేలా కలుపుకోవాలి.తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని కబాబ్స్ లాగా వత్తుకోవాలి. తరువాత వీటిపై జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి. తరువాత మరో పావు బ్రెడ్ క్రంబ్స్ తో కబాబ్స్ కు రెండు వైపులా కోటింగ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక కబాబ్స్ వేసి మధ్యస్థ మంటపై లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే హరా బారా కబాబ్స్ తయారవుతాయి. వీటిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.