Healthy Jonna Dosa : జొన్నపిండితో రొట్టెలే కాకుండా మనం వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. జొన్నపిండితో చేసుకోదగిన వెరైటీలలో జొన్నదోశ కూడా ఒకటి. జొన్నదోశ క్రిస్పీగా,. చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశను ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా జొన్నపిండితో దోశను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ దోశను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా 5 నుండి 10 నిమిషాల్లో ఈ దోశను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా జొన్నపిండితో దోశను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నపిండి – అర కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత,నీళ్లు – తగినన్ని.
జొన్న దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండిని తీసుకోవాలి. తరువాత బియ్యంపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని పలుచగా కలుపుకోవాలి. ఈపిండిని ఉండలు లేకుండా రవ్వ దోశ మాదిరి కలుపుకున్న తరువాత పెనాని తీసుకుని స్టవ్ మీద ఉంది వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. ఈ దోశ మామూలు దోశ మాదిరి రాదు. దీనిని రవ్వ దోశలాగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఎర్రగా కాలిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన జొన్న దోశను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.