మనకు బయట లభించే తీపి పదార్థాల్లో లడ్డూలు కూడా ఒకటి. మనకు బయట వివిధ రుచుల్లో ఈ లడ్డూలు లభ్యమవుతూ ఉంటాయి. వీటిలో మోతీచూర్ లడ్డూ కూడా ఒకటి. ఈ లడ్డూలు ఎంతో రుచిగా నోట్లో వేసుకోగానే కరిపోయేలా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. బయట దొరికే విధంగా ఉండే ఈ మోతీచూర్ లడ్డూలను మనం చాలా సులువుగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మోతీచూర్ లడ్డూలను ఏవిధంగా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మోతీచూర్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
పాకం తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
మోతీచూర్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని, ఎల్లో ఫుడ్ కలర్ ను వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లను పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక బూందీ గంటెను కానీ, జల్లి గంటెను కానీ తీసుకుని అందులో పిండిని వేసి స్పూన్ తో కానీ, చేత్తో కానీ కలపడం వల్ల బూందీ చక్కగా నూనెలో పడుతుంది. ఈ బూందీని పూర్తిగా ఎర్రగా కాల్చకుండా కొద్దిగా వేగగానే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా బూందీ అంతా తయారు చేసుకున్న తరువాత ఈ బూందీని ఒక జార్ లో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఒక కళాయిలో పంచదారను, నీళ్లు పోసి వేడి చేస్తూ పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగి కొద్దిగా జిగురుగా అయిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీని వేసి కలపాలి. బూందీ పూర్తిగా పంచదార మిశ్రమాన్ని పీల్చుకునే వరకు ఉడికించాలి. తరువాత యాలకుల పొడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచిన తరువాత అందులో నెయ్యిని వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ లడ్డూల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా తయారు చేసిన లడ్డూలపై మనకు కావల్సిన డ్రై ఫ్రూట్స్ ను ఉంచి గార్నిష్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మోతీచూర్ లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. మోతీచూర్ లడ్డూలను చాలా చిన్న రంధ్రాలు ఉన్న జల్లిగంటెను ఉపయోగించి తయారు చేస్తారు. అలాంటి గంటె లేని వారు ఈ విధంగా మోతీచూర్ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.