Soft Idli : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇతర అల్పాహారాల కంటే ఇడ్లీలు ఎంతో శ్రేయస్కరమైనవి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఇడ్లీలను చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా కూడా ఇడ్లీలను మెత్తగా తయారు చేసుకోలేకపోతుంటారు. కేవలం కొన్ని చిట్కాలను పాటించి మనం మెత్తగా ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. మెత్తని ఇడ్లీలను తయారు చేసుకోవడానికి పాటించవలసిన చిట్కాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెత్తని ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక కప్పు, ఇడ్లీ రవ్వ – రెండు లేదా రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
మెత్తని ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు మాత్రమే నానబెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా పిండి పట్టడానికి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినప పప్పును జార్ లో వేసి తగినన్ని చల్లని నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మినప పప్పును మిక్సీ పట్టేటప్పుడు చల్లని నీటిని పోయడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలో ఉన్న నీళ్లు అంతా పోయేలా చేత్తో పిండుతూ మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి బాగా కలిపి మూత పెట్టి 6 నుండి 8 గంటల పాటు మాత్రమే పులియబెట్టాలి. 8 గంటల కంటే ఎక్కువ సమయం పాటు పిండిని పులియబెట్టకూడదు.
పిండి పులిసిన తరువాత మూత తీసి తగినంత ఉప్పు, నీళ్లను పోసి మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఇడ్లీ పాత్రలో వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై కేవలం 10 నిమిషాల పాటు మాత్రమే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెత్తగా మృదువుగా ఉండే ఇడ్లీలు తయారవుతాయి. ఈ ఇడ్లీలను పల్లి చట్నీ, సాంబార్ లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీల తయారీలో కేవలం సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను మాత్రమే ఉపయోగించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి.