Honey Potato : మనకు రెస్టారెంట్ లలో లభించే స్నాక్ ఐటమ్స్ లో హానీ పొటాటోస్ కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే ఈ స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తీసుకోవడానికి, స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. తియ్య తియ్యగా, కారంగా ఉండే ఈ హనీ పొటాటోను అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ హనీ పొటాటోస్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హనీ పొటాటో తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీస్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, మైదాపిండి – 2 టీ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీస్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా తరిగిన క్యాప్సికం – 1, సోయా సాస్ – ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ సాస్ – 2 టీ స్పూన్స్, టమాట సాస్ – 2 టీ స్పూన్స్, వెనిగర్ – ఒక టీ స్పూన్, తేనె – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
హనీ పొటాటో తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని నీటిలో వేసి కడగాలి. ఇప్పుడు ఈ పొటాటో ఫింగర్స్ ను నీళ్లు లేకుండా పూర్తిగా వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత కార్న్ ఫ్లోర్, మైదాపిండి, బియ్యంపిండి వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని కలుపుకోవాలి. తరువాత మరో గిన్నెలో పావు కప్పు కార్న్ ఫ్లోర్, పావు కప్పు బియ్యంపిండి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి గట్టి పేస్ట్ లాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసివేడి చేయాలి. నూనె వేడయ్యాక పొటాటో ఫింగర్స్ ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత నూనెను బాగా వేడి చేసి మరలా ఈ ఫింగర్స్ ను నూనెలో వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రైన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొటాటో ఫింగర్స్ మరింత క్రిస్పీగా తయారవుతాయి.
ఇప్పుడు కళాయిలో నువ్వులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.తరువాత అదే కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం వేసి వేయించాలి. దీనిని దోరగా వేయించిన తరువాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాట సాస్, వెనిగర్, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని కళాయిలో వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి కలిపి 2 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత తేనె వేసి కలపాలి. తరువాత వేయించిన పొటాటో ఫింగర్స్ వేసి టాస్ చేసుకోవాలి. తరువాత నువ్వులు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హనీ పొటాటో తయారవుతుంది. ఇలా తయారు చేసిన హనీ పొటాటో ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.