Hotel Style Mixed Vegetable Curry : మనం చపాతీ, రోటీ, నాన్, పూరీ, బటర్ నాన్ వంటి వాటిని తినడానికి రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాము. చపాతీ, నాన్ వంటి వాటిని కూరలతో తింటేనే మరింత రుచిగా ఉంటాయి. ఈచపాతీలల్లోకి ఒక్కో కూరగాయను ఉపయోగించి ఒక్కో కూర కాకుండా అన్ని కూరగాయలను కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీలో ఏ కూరగాయనైనా వాడుకోవచ్చు. అలాగే దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -అర కప్పు, జీలకర్ర -ఒక టీ స్పూన్, జీడిపప్పు – 15, తరిగిన పచ్చిమిర్చి – 4, పొడువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, బంగాళాదుంప ముక్కలు – ఒక కప్పు, తరిగిన క్యారెట్ ముక్కలు -ఒక కప్పు, పసుపు -అర టీ స్పూన్, బీన్స్ ముక్కలు -అరకప్పు, క్యాలీ ప్లవర్ ముక్కలు – అర కప్పు, పచ్చి బఠాణీ – అర కప్పు, టమాట ముక్కలు -ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – 3 టీ స్పూన్స్, వేడి నీళ్లు – అర కప్పు, చిలికిన పెరుగు -ఒక కప్పు.
మసాలా పేస్ట్ కు కావల్సిన పదాకర్థాలు..
ధనియాలు – 2టేబుల్ స్పూన్స్, యాలకులు – 3, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్స్.
మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత బీన్స్ వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాలపాటు వేయించాలి. తరువాత క్యాలీప్లవర్ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి కలపాలి.
వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.