Hotel Style Tiffin Sambar : మనం ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్స్ ను సాంబార్ తో తీసుకుంటూ ఉంటాము. టిఫిన్స్ లోకి చేసే సాంబార్ చిక్కగా, చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది టిఫిన్స్ ను సాంబార్ తో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ టిఫిన్ సాంబార్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే ఆంధ్రా స్టైల్ టిఫిన్ సాంబార్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ చిక్కగా, కమ్మగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ సాంబార్ ను రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, చిక్కగా ఉండే ఈ ఆంధ్రా స్టైల్ టిఫిన్ సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా స్టైల్ టిఫిన్ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక కప్పు, పెసర పప్పు – అర కప్పు, నీళ్లు – మూడున్నర కప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 6, తరిగిన పచ్చిమిర్చి – 4, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, సాంబార్ ఉల్లిపాయలు – 200గ్రా., తరిగిన మునక్కాయ – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన టమాట – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఇంగువ – పావు టీస్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
aఆంధ్రా స్టైల్ టిఫిన్ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కందిపప్పును, పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పులను కుక్కర్ లో వేసి నీళ్లు పోసి మూత పెట్టి పప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత పప్పును మెత్తగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత మునక్కాయ, క్యారెట్, టమాట ముక్కలు వేసి మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి.
తరువాత అర లీటర్ నీళ్లు పోసి 4 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ తాళింపును పప్పులో వేసి కలపాలి. తరువాత లీటర్ నుండి లీటర్నర నీళ్లు పోసి సాంబార్ ను మరిగించాలి. దీనిని 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత చింతపండు గుజ్జు, కొత్తిమీర, ఇంగువ వేసి మరో 15 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టిఫిన్ సాంబార్ తయారవుతుంది. ఈ సాంబార్ తో టిఫిన్స్ ను తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈవిధంగా ఇంట్లోనే చాలా సులభంగా టిఫిన్ సాంబార్ ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.