Pineapple Milkshake : పైనాపిల్ పండ్లు పుల్లగా ఉంటాయని, తింటే నాలుక మండుతుందని చెప్పి చాలా మంది పైనాపిల్ పండ్లను తినరు. కానీ వీటిని తింటే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పైనాపిల్ పండ్లను తినడం వల్ల దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పైనాపిల్ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ పండ్లను తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. కంటి చూపు పెరుగుతుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. హైపర్ టెన్షన్ సైతం తగ్గుతుంది.
అయితే పైనాపిల్‌తో మనం పలు రకాల డ్రింక్స్‌ను కూడా తయారు చేసి తాగవచ్చు. పైనాపిల్ పండ్లను తినలేని వారు ఆ పండ్లలో ఒక డ్రింక్ ను తయారు చేసి తాగవచ్చు. దీన్ని తయారు చేయడం ఎంతో సులభం. పైనాపిల్ పండ్లలో మిల్క్ షేక్ చేసి తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టపడతారు. ఇక దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ మిల్క్ షేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పైనాపిల్ ముక్కలు – 2 కప్పులు, చల్లని పాలు – ఒకటింపావు కప్పు, చక్కెర – 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పలుకులు – పావు కప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), యాలకుల పొడి – అర టీస్పూన్, డ్రై ఫ్రూట్స్ పలుకులు – కొన్ని.
పైనాపిల్ మిల్క్ షేక్‌ను తయారు చేసే విధానం..
డ్రై ఫ్రూట్స్ పలుకులు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్ షేక్ని గ్లాసుల్లో పోసిన తరువాత డ్రై ఫ్రూట్స్ పలుకుల్ని అలంకరిస్తే సరి. దీంతో ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తాగవచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టి మరీ తాగవచ్చు. ఈ మిల్క్ షేక్‌ను తాగడం వల్ల ఎన్నో పోషకాలతోపాటు శక్తి కూడా లభిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పైనాపిల్ పండ్లను తింటే నాలుక మండుతుందని భావించే వారు ఇలా ఆ పండ్లతో మిల్క్ షేక్ ను తయారు చేసి తాగవచ్చు. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. అలాగే లాభాలను కూడా అందిస్తుంది.