Ghee : ప్రస్తుత తరుణంలో మార్కెట్‌లో ఎక్కడ చూసినా అన్నీ కల్తీయే అవుతున్నాయి. పాలు మొదలుకొని మనం తినే ఇతర ఆహారాల వరకు అన్ని పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఎక్కడ చూసినా అంతా కల్తీమయంగా మారింది. ఈ క్రమంలో స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారాలను గుర్తించడం కష్టంగా మారింది. ఇక ఇటీవలి కాలంలో నెయ్యిని కూడా బాగా కల్తీ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల కల్తీ నెయ్యి బయటపడుతోంది. అయితే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు, కల్తీ నెయ్యిని సులభంగా గుర్తించవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి పూర్తిగా కరిగి ఉన్నప్పుడు ద్రవ రూపంలో అది బంగారు రంగులో కనిపిస్తుంది. లైట్‌కు ఎదురుగా ఉంచితే పారదర్శకంగా కనిపిస్తుంది. అవతలి వస్తువులు క్లియర్‌గా కనిపిస్తాయి. ఒకవేళ మీరు కొన్న నెయ్యి అలా లేకుండా మసకగా ఉందంటే అది నకిలీ నెయ్యి అని గుర్తించాలి. స్వచ్ఛమైన నెయ్యిని బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తాయి. కనుక ఆ ప్రొడక్ట్స్‌నే కొనాలి. వాటిపై నెయ్యి నాణ్యత, ఇతర ప్రమాణాలను సూచించే విధంగా లేబుల్స్ ఉంటాయి. కనుక అలాంటి నెయ్యి కొనాలి. లోకల్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయకూడదు.
నెయ్యిని మరిగించే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. కనుక బాగా కరిగిస్తే కానీ నెయ్యి వాసన రాదు. అలా కాకుండా కాస్త కరగగానే నెయ్యి వాసన వస్తుందంటే అది కల్తీ నెయ్యి అని అర్థం చేసుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద కాస్త గడ్డ కట్టిన నెయ్యిని తీసుకుని అరచేతిలో వేయాలి. అది వెంటనే కరగడం మొదలైతే అది స్వచ్ఛమైన నెయ్యి అని గుర్తించాలి. ఒక గ్లాస్‌లో నీళ్లను తీసుకుని అందులో కాస్త గడ్డ కట్టిన నెయ్యి వేయాలి. అది మునిగితే నకిలీ నెయ్యి అని గుర్తించాలి. స్వచ్ఛమైన నెయ్యి నీటిపై తేలుతుంది. మీరు నెయ్యిని కరిగిస్తున్నప్పుడు దాని నుంచి నురగ లేదా ఆవిరి వస్తుందంటే అది కల్తీ నెయ్యి అని అర్థం.