Mango Frooti : వేసవికాలంలో ఎండ నుండి బయటపడడానికి మనం రకరకాల శీతల పానీయాలను సేవిస్తూ ఉంటాం. మనం ఎక్కువగా తీసుకునే శీతల పానీయాల్లో మ్యాంగో ఫ్రూటీ కూడా ఒకటి. మ్యాంగో ఫ్రూటీ చాలా రుచిగా ఉంటుంది. అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఈ ఫ్రూటీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట లభించే ఫ్రూటీలో ఫ్రిజర్వేటివ్స్ ను కలుపుతారు. ఎటువంటి ఫ్రిజర్వేటివ్స్, రంగులు కలపకుండా ఫ్రూటీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాంగో ఫ్రూటీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి మామిడికాయ – 1, పండిన తియ్యటి మామిడి పండ్లు – 2, నీళ్లు – 800 ఎమ్ ఎల్, పంచదార – ముప్పావు కప్పు లేదా తగినంత.
మ్యాంగో ఫ్రూటీ తయారీ విధానం..
ముందుగా పచ్చి మామిడికాయ అలాగే పండిన మామిడికాయలపై ఉండే చెక్కును తీసేసి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో పంచదార, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ పై మూతను ఉంచి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ గుజ్జును జల్లెడలో వేసి గంటెతో బాగా మెదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు మరియు పిప్పి వేరవుతుంది. ఇలా తయారు చేసుకున్న మామిడికాయ గుజ్జులో మామిడికాయలను ఉడికించిన నీటిని పోసి కలపాలి. ఫ్రూటీ మరీ చిక్కగా ఉంటే తగినన్ని వేడి నీటిని పోసుకోవాలి.
ఉండలు లేకుండా కలుపుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మ్యాంగో ఫ్రూటీ తయారవుతుంది. దీనిని మనం ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఎటువంటి ఫ్రిజర్వేటివ్స్ లేకుండా ఇలా ఇంట్లోనే ఫ్రూటీని తయారు చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు లేదా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈ ఫ్రూటీని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తాగుతారు.