Masala Mushroom Curry : మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Masala Mushroom Curry : పుట్ట‌గొడుగుల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌కాల‌ను చేసి తింటుంటారు. అయితే ఎవ‌రు ఏం చేసినా అవి రెస్టారెంట్ల‌లో వ‌డ్డించే మాదిరిగా ఉండ‌వు. అక్క‌డ వ‌డ్డించే మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే కాస్త శ్ర‌మిస్తే దీన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎంచ‌క్కా చేసి తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీకి ఏమేం ప‌దార్థాలు కావాలి.. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పుట్ట‌గొడుగులు – 400 గ్రాములు, ప‌సుపు – అర టీస్పూన్‌, న‌ల్ల మిరియాల పొడి – అర టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, క‌సూరి మేథీ పొడి – ఒక టీస్పూన్‌, పెరుగు – 3 టేబుల్ స్పూన్లు, నూనె – 3 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క – 1, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4, జీల‌క‌ర్ర – 1 టీస్పూన్‌, ఉల్లిపాయ‌లు – 2 (స‌న్న‌గా త‌ర‌గాలి), ప‌చ్చి మిర్చి – 3 (స‌న్న‌గా త‌ర‌గాలి), అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, కారం పొడి – ముప్పావు టీస్పూన్‌, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, ట‌మాటా – 2 (స‌న్న‌గా త‌ర‌గాలి), బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – 1 టీస్పూన్‌, జీడిప‌ప్పు పొడి – 1 టీస్పూన్‌, కొత్తిమీర – 1 టీస్పూన్‌, మంచినీళ్లు – త‌గిన‌న్ని.

how to make Masala Mushroom Curry in telugu know the recipe
Masala Mushroom Curry

మ‌సాలా మ‌ష్రూమ్ క‌ర్రీ త‌యారు చేసే విధానం..

పుట్ట‌గొడుగుల‌ను తీసుకుని స‌గానికి నిలువ‌గా క‌ట్ చేయాలి. మంచి నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. మ‌ట్టి లేకుండా జాగ్ర‌త్త‌గా క‌డ‌గాలి. పుట్ట‌గొడుగుల‌ను బౌల్‌లో తీసుకుని పావు టీస్పూన్ ప‌సుపు, న‌ల్ల మిరియాల పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరి మేథీ పొడితోపాటు పెరుగు వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టాలి. స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ మీద నూనె వేయాలి. దాల్చిన చెక్క‌, యాల‌కులు, లవంగాలు, జీల‌క‌ర్ర వేసి గ‌రిటెతో క‌దుపుతూ వేయిస్తూ త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి రంగు మారేంత వ‌ర‌కు వేయించాలి. ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిశ్ర‌మంలో క‌ల‌పాలి. త‌రువాత కారం పొడి, ధ‌నియాల పొడితోపాటు పావు టీస్పూన్ ప‌సుపు వ‌రుస‌గా వేసి గ‌రిటెతో క‌ద‌పాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి.

ఈ మిశ్ర‌మం ముద్ద‌గా కాకుండా క‌దుపుతూ ట‌మాటా ముక్క‌లు వేసి మిశ్ర‌మంలో క‌లిపి కాస్త మ‌గ్గేంత వ‌ర‌కు ఉంచాలి. త‌రువాత బ‌ట‌ర్ వేసి బాగా క‌దుపుతూ ఉప్పు వేసి మిశ్ర‌మాన్ని క‌ల‌పాలి. పాన్ మీద మూత పెట్టి నాలుగు నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై వండాలి. గ‌రిటెతో వ‌త్తుతూ ఆ మిశ్ర‌మాన్ని క‌దిపిన త‌రువాత ప‌క్క‌న ఉంచుకున్న పుట్టగొడుగుల మిశ్ర‌మాన్ని వేసి నాలుగు నిమిషాల పాటు ఎక్కువ మంట‌పై ఉడికించాలి. త‌రువాత జీడిప‌ప్పు పొడి వేసి మిశ్ర‌మంలో క‌లిపాక‌.. 100 ఎంఎల్ నీళ్లు పోసి క‌ల‌పాలి. పాన్ మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై 5 నిమిషాలు ఉడికించిన త‌రువాత గ‌రిటెతో మిశ్ర‌మాన్ని క‌ల‌పాలి. ఇందులో కొత్తిమీర గార్నిష్‌లా వేసుకుని క‌లిపిన త‌రువాత 2 నిమిషాలు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. దీన్ని చ‌పాతీ లేదా అన్నంతో క‌లిపి తింటే రుచిక‌రంగా ఉంటుంది.

Editor

Recent Posts